జుట్టు వేగంగా పెరగడానికి ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలి?
ఉల్లిపాయ ... మనం ప్రతి నిత్యం ఉపయోగించే వంట పదార్థం. కానీ దీనిలో అనేక రోగాలను, ఆరోగ్య సమస్యలను తగ్గించే ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్న ఉల్లిపాయ రసం (పెద్ద ఉల్లిపాయ కంటే చిన్న ఉల్లిపాయ మంచి ఫలితాలనిస్తుంది) ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది, దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ఒక ప్రకృతి సిద్ధ ఔషధం.
అసలు ఉల్లిపాయ రసంలో ఏముంది ?
ఉల్లిపాయలలో సల్ఫర్ ఉంటుంది, ఇది హెయిర్ ఫోలికల్స్‌కు రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది మరియు జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
జుట్టు పెరుగుదలకు మీరు చిన్న ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.
✦ ఒక చిన్న ఉల్లిపాయను పీల్ చేసి చిన్న ముక్కలుగా కోయండి. మిక్సర్ లో వేసి బాగా గ్రైండ్ చేసి రసాన్ని తీయండి. తర్వాత స్ట్రైనర్ లేదా చీజ్‌క్లాత్‌లో పోసి వడకట్టండి.
✦ ఈ రసాన్ని తల మాడు భాగానికి నేరుగా కాని లేదా కొబ్బరి నూనె / ఆముదం కలిపి కాని సమానంగా పట్టించండి. తర్వాత ముని వేళ్ళతో సున్నితంగా మర్దనా చేయండి. మీకు పొడవాటి జుట్టు ఉంటే, మీరు రసాన్ని అప్లై చేయడానికి కాటన్ బాల్ లేదా చిన్న బ్రష్‌ని ఉపయోగించుకోండి.
✦ తల మొత్తానికి అప్లై చేసిన తర్వాత, సల్ఫర్ సమ్మేళనాలు వెంట్రుకల కుదుళ్లలోకి చొచ్చుకుపోయేలా చేయడానికి 15 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి.
✦ తర్వాత మీ జుట్టును గోరువెచ్చని నీటితో బాగా కడగాలి. ఉల్లి యొక్క వాసన పోవడానికి తేలికపాటి షాంపూని ఉపయోగించండి. కావాలనుకుంటే మీరు తర్వాత కండీషనర్‌ని కూడా వాడవచ్చు.
✦ మంచి ఫలితాలను పొందడానికి, ఈ విధానాన్ని వారానికి 2 నుండి 3 సార్లు ప్రయత్నించండి. కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా చేయడం ద్వారా జుట్టు పెరుగుదలను గమనించవచ్చు.
వీటితో పాటు మంచి ఆహారం, మంచి నిద్ర, వ్యాయాయం వంటివి కూడా ఫలితాలను మంచిగా ప్రభావితం చేస్తాయి. అధిక రసాయనాలతో కూడిన నూనెలు, షాంపూలు వినియోగం తగ్గించాలి. ఏవైనా ప్రతికూల ప్రభావాలు గుర్తిస్తే వైద్య నిపుణుడిని సంప్రదించండి.