ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా యొక్క యెమెన్ శాఖకు చెందిన నాయకుడు ఖలీద్ బతర్ఫీ మృతి చెందినట్లుగా ఆ ఉగ్రవాద సంస్థ స్వయంగా ఒక వీడియో ద్వారా ప్రకటించింది. అల్-ఖైదా యొక్క జెండాలో ఈ మృతదేహాన్ని చుట్టిన వీడియోను సంస్థ విడుదల చేసింది. అతని మరణానికి సంబంధించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. బతర్ఫీ వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా.
ఇతను 1999లో సౌదీ అరేబియా నుండి ఆఫ్ఘనిస్తాన్ కు తన మకాం మార్చి, అక్కడ తాలిబాన్లతో కలిసి అమెరికా సైన్యంపై దాడులకు పాల్పడ్డాడు. 2010లో అల్-ఖైదా లో చేరి, యెమెన్ లోని అబ్యాన్ ప్రావిన్స్ ఆక్రమణలో కీలకమైన పాత్ర పోషించాడు.
అమెరికా చేపట్టిన డ్రోన్ దాడిలో మరణించిన నాయకుడు ఖాసిం అల్-రిమి తర్వాత, 2020లో ఈ శాఖకు అధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే గతంలో అమెరికా ఇతని తలపై 40 కోట్ల రివార్డును ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత ఈ యెమెన్ శాఖ (AQAP) అత్యంత ప్రమాదకరమైన గ్రూపుగా అవతరించినట్లుగా చెబుతారు.
"అల్లాహ్ తన ప్రతిఫలాన్ని ఓపికగా కోరినప్పుడు అతని ఆత్మను తీసుకొన్నాడు. స్థిరంగా నిలిచి జిహాద్ చేశాడు" అని ఉగ్రవాదులు ఈ వీడియోలో తెలిపినట్లుగా అమెరికాకు చెందిన SITE ఇంటెలిజెన్స్ గ్రూప్ తెలిపింది.