గంటలకొద్దీ కూర్చొని పనిచేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలేంటి?
మీరు కంప్యూటర్ రంగంలో కానీ, ఇతర రంగాలలో కంప్యూటర్ తో పని చేస్తున్నారా...? ఐతే ఇది మీరు తప్పక చదవాల్సిన అంశం. ప్రస్తుత మన జీవన విధానం సైన్స్ మరియు టెక్నాలజీ లకు అనుబంధంగా నడుస్తోంది. చాలా మంది శారీరక శ్రమ లేని వృత్తి లేదా వ్యాపారాలనే ఇష్టపడుతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఉద్యోగాలలో మాత్రమే కాకుండా వ్యాపారాలలో కూడా "కంప్యూటర్" అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. అప్పుడప్పుడు కంప్యూటర్ తో పని చేయడం పెద్ద సమస్య కాదు కానీ, గంటల తరబడి పనిచేయడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా IT రంగంలో పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతయినా ఉంది. కదలకుండా గంటల కొద్దీ ఒకే చోట కూర్చుని పనిచేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని ఆరోగ్య నిపుణులు పలు అధ్యయనాల ద్వారా తెలియజేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఊబకాయం: గంటల తరబడి శరీరానికి కదలికలు లేకుండా ఒకే చోట పనిచేయటం వల్ల తిన్న ఆహారం కొవ్వుగా మారుతుంది. తద్వారా ఊబకాయం సమస్య వస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అవకాశం ఉంది.
మధుమేహం: ఇలా పెరిగిన కొవ్వు నిల్వలు రక్తంలో చేరి చెక్కర స్థాయిలను బాగా పెంచి మధుమేహం రావడానికి కారణం అవుతాయి.
రక్తపోటు - గుండె సమస్యలు: రక్తనాళాలలో చేరిన ఈ కొవ్వులు రక్తప్రసరణకు అవరోధంగా మారి అధిక రక్తపోటును కలిగించే ప్రమాదం ఉంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.
మెడ, వెన్నెముక, నడుము, సయాటికా సమస్యలు: ఎక్కువ సేపు కంప్యూటర్ పై ఏకాగ్రతతో పనిచేయడం వల్ల ముందుగా మెడ కండరాలపై ఒత్తిడికి గురై మెడ నొప్పులు, ఆపై వెన్నెముక డిస్క్ సమస్యలు వస్తాయి. గంటల కొద్దీ ఒకే చోట ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల నడుము నొప్పి ఎక్కువవుతుంది. అంతేకాక సయాటికా నరం ఒత్తిడికి లోనై, సయాటికా నొప్పి వచ్చే అవకాశం ఉంది.
పైల్స్: ఎక్కువసేపు మెత్తటి కుషన్ గల కుర్చీలలో కూర్చోవడం వల్ల గాలి ప్రసరణ లేక పైల్స్ వంటి సమస్యలు వస్తాయి.
మణికట్టు - ఆర్థరైటిస్ సమస్యలు: కంప్యూటర్ లో ఎక్కువ సేపు కీబోర్డ్ మరియు మౌస్ వాడకం వల్ల చేతి మణికట్టు భాగంపై దీర్ఘకాలంలో ప్రభావం ఉంటుంది. అంతేకాక ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక రోగాల భారిన పడే ప్రమాదం కూడా ఉంది. చేతులు తిమ్మిరి రావడం, నరాల నొప్పి, కండరాల నొప్పులకు దారితీస్తాయి.
బద్ధకం: ఈ రకపు పని విధానంలో బద్ధకం పెరగడంతో పాటు, వృద్ధాప్య ఛాయలు ముందుగానే కనిపించే అవకాశం కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
మరి ఈ సమస్యలు రాకుండా మనం చేయగలిగిన పరిష్కారాలేంటో తెలుసుకుందాం.
1. ముఖ్యంగా ప్రతి గంటకు ఒకసారి లేచి కనీసం 5 నిముషాలు నడవడం లేదా రిలాక్స్ కావడం చేయాలి.
2. పని మధ్యలో కంప్యూటర్ స్క్రీన్ నుండి కొన్ని సెకన్ల పాటు దృష్టి మళ్ళించుకోవాలి. లేకపోతే కళ్ళు పొడిబారి, దృష్టి సమస్యలు వస్తాయి.
3. కంప్యూటర్ నుండి సుమారు 2 నుండి 3 అడుగుల దూరమైనా ఉండేలా చూసుకోవడం మంచిది.
4. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
5. లిఫ్ట్ కు బదులుగా మెట్లను ఉపయోగించుకోవాలి.
6. భోజనం చేసిన వెంటనే కుర్చీకి పరిమితం అవకుండా, కొద్ది సేపు నడవడం ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు.