మలబద్దకం శాశ్వత నివారణ మార్గాలేంటి?
మలబద్ధకం అనేది నేటి జీవన విధానంలో చాలా సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, పని వేళల్లో వచ్చిన మార్పులు, కనీస వ్యాయామం లేకపోవడం అనేవి ఇటువంటి ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. మలబద్ధకం అంటే మల విసర్జన కష్టతరం కావడం... ప్రేగు కదలికలు సరిగా లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, అజీర్ణం వంటి వాటి వల్ల మలం గట్టిగా మారి విసర్జించడంలో నొప్పి, రక్త స్రావం కలగడం జరుగుతుంది.
ఈ మలబద్ధకం నుండి ఉపశమనం కోసం ఏం చెయ్యాలి ?
ఎక్కువ నీరు త్రాగండి: హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల మలాన్ని మృదువుగా చేసి వాటిని సులభంగా బయటకు వెళ్లేలా చేయవచ్చు. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగడం చాలా మంచిది. వేసవిలో అయితే మరింత నీరు తాగడం అవసరం.
పీచు / ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోండి: పీచు / ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ప్రేగు కదలికలను నియంత్రించడంలో మరియు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. కావున ఫైబర్ యొక్క మంచి వనరులైన పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు మరియు తృణధాన్యాలు వంటివి అధికంగా తీసుకోవడం చాలా ఉపయోగకరం.
కనీస వ్యాయామం చేయండి: నేటి జీవన శైలి లో శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి కదలికలు తగ్గిపోయాయి. దీనికై కనీస వ్యాయామం ప్రతిరోజు చేయడం ద్వారా ప్రేగు కదలికలను ఉత్తేజపరిచేందుకు మరియు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ కనీసం 30 నుండి 45 నిమిషాల వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.
సహజ సిద్దమైన మందులను ప్రయత్నించండి: కొన్ని ఆహారాలు మరియు హెర్బల్ సప్లిమెంట్లు మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఆరోగ్య నిపుణుల సలహా మేరకు వీటిని ప్రయత్నించవచ్చు.
మంచి ఆహారపు అలవాట్లను ఏర్పరచుకోండి: వేలకు సరైన ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఫైబర్ ఉండే ముల్లంగి, బీరకాయ, సొరకాయ, ఆపిల్, జామ, పొట్టు తీయని ధాన్యాలు, నట్స్ వంటివి ఈ మలబద్దకాన్ని నివారించడంలో సహకరిస్తాయి.
ఈ మలబద్ధకం సమస్య కొనసాగి తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం ఉంటే, వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.