బియ్యం నీటితో జుట్టు నిజంగా పెరుగుతుందా?
ఈ రోజుల్లో ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ జుట్టు సంరక్షణపై శ్రద్ధ బాగా పెరిగింది. తమ జుట్టును పొడవుగా, ఒత్తుగా, దృఢంగా మరియు నల్లగా మృదువుగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల రసాయనాలతో కూడిన నూనెలు, షాంపులు, రంగులు వాడుతూ ఉంటారు. ఈ రసాయనాల వల్ల జుట్టుకు మేలు కన్నా హాని ఎక్కువ జరుగుతుంది. వీటికి ప్రత్యామ్నాయంగా సహజ పద్దతిలో, మనం నిత్యం ఉపయోగించే ఆహార ధాన్యమైన బియ్యం (వరి) తో ఈ ఫలితాలు పొందే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం నానబెట్టిన నీటితో జుట్టును ఆరోగ్యంగా, బలంగా చేసుకోవచ్చు. బియ్యం నీటిలో ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టు మూలాల్లోకి చొచ్చుకుపోయి, లోపలి నుండి పోషణ అందిస్తుంది. డ్యామేజ్‌ను రిపేర్ చేసి, బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తుంది. బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు మరియు మినరల్స్ ఉన్నాయి, ఇవి జుట్టుకు పోషణ మరియు తేమను అందిస్తాయి.
మీలో చాలామంది చైనాలోని 'హువాంగ్లూ’ అనే గ్రామంలో స్త్రీలు చాలా పొడవైన జుట్టును కలిగి రికార్డు సృష్టించారని విని ఉంటారు. వారు ఇంతటి పొడవాటి జుట్టుకు 'బియ్యం నీళ్లు' ఒక ప్రధాన కారణంగా చెబుతారు. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎలా తయారుచేయాలి? ఎలా ఉపయోగించాలి?
ఒక పాత్రలో ఒక కప్పు పొట్టు తీయని బియ్యం తీసుకొని ఒకసారి కడగండి. తర్వాత పూర్తిగా మునిగే వరకు నీళ్ళు పోసి నానబెట్టండి. అదే రోజు వాడాలి అనుకుంటే 20 - 30 నిమిషాలు తర్వాత వడకట్టి బియ్యాన్ని వేరుచేసి నీటిని తీసుకోండి. మంచి ఫలితాల కోసం ఒక రాత్రి అంతా నానబెట్టి (పల్చటి బట్టతో మూత పెట్టాలి) ఉదయాన్నే వాడుకోవచ్చు. కావాలంటే దీనితో పాటు ఉసిరి చూర్ణం, నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు రోజ్మేరీ ఆయిల్ వంటి వాటిని కలపడం ద్వారా కండీషనర్ గా కూడా ఉపయోగించవచ్చు.
బియ్యం నీటిని జుట్టు మొదళ్ళ నుండి చివర వరకూ బాగా పట్టించి 20 - 30 నిమిషాలు ఉంచి, బాగా మర్దనా చేయండి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇది జుట్టుకు ఉన్న మురికిని, జిడ్డును తొలంగించి శుభ్రం చేస్తుంది. మీరు షాంపూ మరియు కండిషనింగ్ తర్వాత వెంట్రుకలను శుభ్రం చేయడానికి కూడా వాడవచ్చు. వారానికి కనీసం 2 సార్లు ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.