అయోధ్య: ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న, ఆ నీల మేఘశ్యాముడైన శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట నేడు అనగా జనవరి 22, 2024 తేదీన అంగరంగ వైభవంగా లక్షలాది భక్తులు, రాజకీయ నేతలు, అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల మధ్య కోలాహలంగా జరగబోతోంది. ఈ రామ మందిర నిర్మాణం వెనుక ఎంతో మంది కృషి, ఎన్నో సంవత్సరాల పోరాటం దాగి ఉంది. శ్రీ రాముని జన్మ స్థానమైన అయోధ్య లో ఆయనకు మందిరం నిర్మించడం కోసం 2019 లో 'శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్' ను స్థాపించి ప్రజల నుండి విరాళాలు సేకరణకు శ్రీకారం చుట్టారు. సుమారు 2.7 ఎకరాలలో అనేక ఆధ్యాత్మిక ప్రత్యేకతలతో ఈ దేవాలయ నిర్మాణం చేపట్టారు. మరికాసేపట్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతుంది.
ఇప్పుడు రామ మందిరం యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం.
అయోధ్య రామ మందిరం 2.7 ఎకరాల విస్తీర్ణంలో 380 అడుగులు పొడవు, 250 అడుగులు వెడల్పు, 161 అడుగులు ఎత్తు పరిమాణాలతో పూర్తి స్థాయి సాంప్రదాయ నగర శైలిలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడింది. ఆలయ నిర్మాణంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఏర్పాటు చేసారు. నిర్మాణం మొత్తంలో ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్మించారు. దేవాలయ స్తంభాలపై దేవీ దేవతల విగ్రహాలు చెక్కారు. ఆలయంలో మొత్తంగా 5 రకాల మండపాలు - నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపంచ, కీర్తన మండపం నిర్మించారు. రామ మందిరానికి సమీపంలో చారిత్రాత్మకమైన, పురాతన కాలం నాటి ఒక బావి ఉంది, దీనినే సీతా కూప అని పిలుస్తారు. నైరుతి భాగంలో జటాయువు విగ్రహంతో పాటు పురాతన శివుని ఆలయం పునరుద్ధరించారు. బాల రాముని విగ్రహాన్ని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్రధాన గర్భగుడిలో ప్రతిష్టించారు.
ఆలయం నిర్మాణం విషయానికి వస్తే, సిమెంట్ కానీ, ఇనుము కానీ ఉపయోగించకుండా, 14 మీటర్ల మందంతో ఆలయ పునాదిని రోలర్-కాంపాక్ట్ కాంక్రీటు (RCC)తో నిర్మించారు. ఇది కృత్రిమ శిలలా మారి తీవ్ర భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించారు. తూర్పు వైపు సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి దేవాలయ ప్రవేశం చేసుకోవచ్చు. ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు దానితోపాటు నాలుగు మూలల్లోనూ నాలుగు ఆలయాలు సూర్యాలయం, శివాలయం, గణపతి ఆలయం, భగవతి ఆలయం నిర్మించారు. ప్రహరీకి దక్షిణం వైపున హనుమంతుని ఆలయం, ఉత్తరం వైపున అన్నపూర్ణ మాత ఆలయం నిర్మించారు.
ఆలయ నిర్మాణంలో తమవంతు భాగస్వామ్యం అందించాలని ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య రీతిలో భక్తులు విరాళాలు అందించారు. ఇప్పటి వరకు రూ.1100 కోట్లు ఖర్చు కాగా... మరో రూ.300 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ విరాళాలతో కొన్ని సంవత్సరాల పాటు ఆలయ నిర్వహణ చేయవచ్చునని భక్తులు చెబుతున్నారు.