అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలకు మంచి పరిష్కారం!
నేటి యాంత్రిక జీవన విధానంలో వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. పని, తిండి, నిద్ర సమయాలలో మార్పులు మన ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాలు చూపిస్తూ అనేక రోగాలకు కారణం అవుతున్నాయి. చాలా మంది ఆలస్యంగా భోజనం చేయడం, ముఖ్యంగా రాత్రి పూట తిన్న వెంటనే ఎక్కువసేపు కూర్చోవడం లేదా వెంటనే నిద్రించడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో పాటు శరీరంలోని కొవ్వు అధికమై స్థూలకాయం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. తిన్న వెంటనే కొంచెం సేపు నడవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఈ విషయం మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు.
ఎలా నడవాలి? ఎంత సేపు నడవాలి?
భోజనం చేసిన తర్వాత నెమ్మదిగా 20 అడుగుల నుండి సుమారు అరగంట వరకూ నడవవచ్చు. వేగంగా నడవరాదు. నెమ్మదిగా నడవడం వల్ల మనం తిన్న ఆహారం చిన్న ప్రేగులలో జరుగుతూ జీర్ణం అయ్యి పోషకాలను గ్రహించి, శక్తిగా మార్చి శరీరానికి అందిస్తాయి.
భోజనం తర్వాత నడవడం వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.
2. మలబద్ధకం కూడా తగ్గుతుంది.
3. శరీరంలోని అధిక కొవ్వును కరిగించడం ద్వారా బరువు తగ్గవచ్చు.
4. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు.
5. గుండె పనితీరు మెరుగుపడుతుంది.
6. నిద్రలేమి నుంచి ఉపశమనం పొందవచ్చు.
7. శరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించి, మానసిక ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.
8. రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది.