లవంగాలతో జుట్టును ఒత్తుగా, బలంగా మరియు ఆరోగ్యవంతంగా చేసుకోవడం ఎలా?

 


చుండ్రు మరియు తెల్ల జుట్టును నివారించే సులభమైన విధానం

లవంగం (శాస్త్రీయ నామం : Syzygium Aromaticum) ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇది శతాబ్దాలుగా ప్రపంచ దేశాలలో వంట దినుసుగా చాలా విరివిగా ఉపయోగించబడుతోంది. లవంగాలు అనేక ఔషధ గుణాలను కలిగి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి అని అనేక పరిశోధనలలో నిరూపించబడ్డాయి. భారత్ లాంటి దేశాలలో వారి పూర్వీకులు వీటి ప్రయోజనాలను ఆయుర్వేద శాస్త్రం ద్వారా కూడా తెలియజేసారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వీటిని పండిస్తున్నారు. సౌందర్య ఉత్పత్తులలో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు.

లవంగాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్తీరియా, యాంటీ ఫంగళ్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలతో పాటుగా బీటా కెరోటిన్, న్యూట్రియెంట్స్ ను కలిగి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న బట్టతల, తెల్ల జుట్టు, చుండ్రు వంటి సమస్యలకు చక్కని పరిష్కారంగా కూడా ఉపయోగపడుతోంది. లవంగాలను నీటిలో మరిగించి వడపోసిన ద్రావణాన్ని ఈ జుట్టు సమస్యల నివారణకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ముందుగా నాణ్యమైన (నూనె తీయబడని) లవంగాలను 2 - 3 టీ స్పూన్లు తీసుకొని, బాగా దంచి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో 250 ml నుండి 350 ml నీరు తీసుకొని దానిలో దంచిన లవంగాల పొడిని వేసి 3 నుండి 4 గం. ల పాటు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని గ్యాస్ మీద సిమ్ లో ఉంచి నీరు సగం అయ్యేవరకు మరిగించి చల్లార్చాలి. తర్వాత వడపోసి ఏదైన స్ప్రే బాటిల్ లో పోసి నిల్వ ఉంచుకోవాలి. ఇది సుమారు వారం నుండి 10 రోజుల వరకు తాజాగా ఉంటుంది.

ముందుగా తలను దువ్వెనతో బాగా దువ్వుకొని, తర్వాత ఈ నీటిని స్ప్రే చేసుకొని ముని వేళ్ళతో బాగా మర్దన చెయ్యాలి. తద్వారా తల మాడు భాగానికి రక్త ప్రసరణ మెరుగై, చర్మ రంధ్రాలకు ఈ లవంగాల నీటి యొక్క ఔషధ గుణాలు చేరతాయి. లవంగాలలో అధిక మోతాదులో యాంటీఆక్సిడెంట్ల తో పాటు అనేక పోషకాలు ఉంటాయి, ఇవి మీ జుట్టు పెరుగుదల మరియు బలాన్ని పెంచుతాయి. అలాగే దీనిలో ఉన్న యాంటీ బ్యాక్తీరియా, యాంటీ ఫంగళ్ మరియు యాంటీమైక్రోబయల్ గుణాలు చుండ్రు, తల దురద, పుండ్లు వంటి వాటిని నివారించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా ఒక నెల రోజులలోనే మంచి ఫలితాలు పొందవచ్చు.

Post a Comment

Previous Post Next Post