టేస్టింగ్ సాల్ట్ ... ఆరోగ్య సమస్యలు!

 


టేస్టింగ్ సాల్ట్ అపరిమిత వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు

టేస్టింగ్ సాల్ట్ ... దీని అసలు పేరు మోనోసోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ). ఇదొక రసాయన పదార్థం. చాలా మంది 'అజినోమోటో' అని కూడా పిలుస్తారు. కానీ అజినోమోటో అనేది మోనోసోడియం గ్లూటమేట్ ను ఉత్పత్తి చేసే జపనీస్ కంపెనీ పేరు. భారతదేశం ఈ మోనోసోడియం గ్లుటామేట్‌ను చైనా, థాయ్‌లాండ్ మరియు జర్మనీ దేశాల నుండి ఎక్కువగా దిగుమతి చేసుకొంటూ, అమెరికా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది.

టేస్టింగ్ సాల్ట్ ఇప్పుడు మన వంటకాలలో రుచి, సువాసన కోసం చాలా విరివిగా ఉపయోగించబడుతున్నది. ముఖ్యంగా బిర్యాని, ఫ్రైడ్ రైస్, బేకరీ ఉత్పత్తులు, నాన్ - వెజ్ వంటకాలలో హోటళ్లు , రెస్టారెంట్లు బాగా ఉపయోగిస్తుంటాయి. అయితే U.S. Food and Drug Administration (USFDA) మరియు Codex Alimentarius వంటి అంతర్జాతీయ సంస్థలు ఆహార పదార్థాలలో ఈ MSG ని వినియోగించడంలో కొన్ని నిబంధనలు విధించారు. వారు నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం మాత్రమే వీటిని ఆహార పదార్థాలలో వాడాలి. ఇదేవిధంగా భారత్ లో Food Safety and Standards Authority of India (FSSAI) కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వాటి ప్రకారం, నూడుల్స్ మరియు పాస్తా సహా 50 కంటే ఎక్కువ ఆహార ఉత్పత్తులలో ఈ MSG వినియోగం అనుమతించబడదు.

ఈ టేస్టింగ్ సాల్ట్ వాడిన ఆహారాలను ఎక్కువగా తినడం లేదా పరిమితికి మించి టేస్టింగ్ సాల్ట్ కలిపిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టుగా నిపుణులు సూచిస్తున్నారు.

✹ టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల తలనొప్పి, అలసట, ఛాతీ నొప్పి, చిరాకు, వికారం, వాంతులు మరియు గొంతులో మంట, అర చేతులు, అరికాళ్ళలో మంటలు, కండరాలు నొప్పి వంటి సమస్యలు
✹ హైబీపీ, డయాబెటిస్, కాళ్లు, చేతుల్లో సూదులు గుచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
✹ హార్మోన్ల అసమతుల్యత, నాడీ వ్యవస్థ బలహీన పడటం వల్ల పార్కిన్సన్స్ మరియు అల్జీమర్స్ వంటి సమస్యలు రావచ్చు.
✹ ఇది నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ ను ప్రభావితం చేయడం వల్ల, ఆహార పదార్థాలను ఎక్కువగా తింటారు. తద్వారా ఊబకాయంతో పాటు పలు మెటబాలిక్ సమస్యలు రావచ్చు.
✹ కొంతమంది నిపుణులు టేస్టింగ్ సాల్ట్ ధమనులలో రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు.
చివరగా మోతాదుకు మించి ఈ టేస్టింగ్ సాల్ట్ వాడకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

Post a Comment

Previous Post Next Post