సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజు వరుస బాంబు పేలుళ్లు… 30 మంది మృతి, పలువురికి గాయాలు
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఉగ్రవాదం పెను సవాలుగా మారింది. పాకిస్తాన్ లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఒకరోజు ముందుగానే బలూచిస్తాన్ లో 2 చోట్ల భారీ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 30 మందిమృతి చెందగా, 50 మందికి పైగా గాయాల పాలయ్యారు.
గురువారం పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా బుధవారం జరిగిన ఈ బాంబు పేలుళ్లు ప్రజలను భయాందోళనలకు గురిచేసాయి. ఎన్నికలవేళ ప్రజలను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా నిరోధించేందుకు ఉగ్రవాదులు ఎన్నికల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పిషిన్ జిల్లాకు చెందిన స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం బయట మొదటి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా చనిపోగా 30 మంది వరకు క్షతగాత్రులు అయ్యారు. తరువాత రెండవ బాంబును గంటలోపులోనే ఖిల్లా సైఫుల్లాలో, ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పట్టణంలో, జమియాత్ ఉలేమా ఇస్లాం (JUI) కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 20 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వరుస పేలుళ్లపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం స్పందించి సమస్యాత్మక ప్రాంతాలలో మరింత భద్రతను పెంచుతామని తెలిపింది.