చిలి మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినట్లుగా ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా 2010లో ఒకసారి 2018 లో మరొకసారి చెల్లిదేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఫిబ్రవరి 6, మంగళవారం నాడు జరిగిన ఈ దుర్ఘటనలో ఈయనతో పాటు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు గాయాలతో బయటపడగా, పినేరా దుర్మరణం పాలయ్యారు.
"ఆయన గొప్ప ప్రజాస్వామ్యవాది మరియు దేశం విషయంలో ఉత్తమమైన నిర్ణయాలు తీసుకున్నారు" అని అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ మాట్లాడుతూ, 2010 నాటి భూకంపం తర్వాత దేశ పునర్నిర్మాణానికి దృఢ సంకల్పంతో నాయకత్వమో వహించారని మరియు శాన్ జోస్ గనిలోని 33 మంది మైనర్లను రక్షించడంలోను, కోవిడ్ మహమ్మారి నిర్వహణలోను ఆయన సేవలు మరువలేనివని ప్రశంసించారు.
అధ్యక్షుడు బోరిక్ 3 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించారు, శుక్రవారం నాడు అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈయన మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు నివాళులు అర్పించారు.