నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పి.ఎం.ఎల్ - ఎన్, బిలావల్ భుట్టో జర్దారి సారథ్యంలోని పి.పి.పి పార్టీల మధ్య చర్చలు
ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన సాధారణ ఎన్నికలలో 265 అసెంబ్లీ సీట్లలో ఏ ఒక్క పార్టీకి అత్యధిక మెజారిటీ దక్కకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఇందులో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం వహించిన పాకిస్తాన్ తెహ్రి కే ఇన్సాఫ్ పార్టీ (పి.టీ.ఐ) కి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు 101 స్థానాలను అత్యధికంగా గెలుచుకున్నప్పటికీ, పాకిస్తాన్ సైన్యం మద్దతున్న నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్ పార్టీ (పీ.ఎం.ఎల్ - ఎన్), బిలావల్ భుట్టో ఆధ్వర్యంలోని పి.పి.పి పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. పాకిస్తాన్ ప్రధాని పదవిని మూడేళ్ల పాటు పీ.ఎం.ఎల్ - ఎన్ పార్టీ, రెండేళ్లపాటు పి.పి.పి పార్టీ పంచుకునేందుకు సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి.
అధికారంలోకి వచ్చేందుకు అవసరమైతే 17 స్థానాలు దక్కించుకున్న ఎం.క్యూ.ఎం - పి పార్టీని కూడా కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని పి.టీ.ఐ పార్టీ మాత్రం ఈ కూటమిలో తాము చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కూటమిలో చేరే కంటే ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము ఇష్టపడుతున్నామని స్పష్టం చేసారు.