సూర్య నమస్కారాలు ఎన్ని? వాటిని ఏ విధంగా సాధన చేయాలి?

 


సూర్య నమస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలు

సూర్య నమస్కారాలలో మొత్తం 12 రకాల ఆసనాలు ఉంటాయి. వీటిని ఒక క్రమ పద్దతి లో ఎలా చేయాలి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్రణామాసన : సూర్యునికి ఎదురుగా నిటారుగా నిలబడి రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి.
➤ ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

2. హస్త ఉత్తానాసన : ప్రణామాసన భంగిమ నుండి ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా చేతులు పైకెత్తి వెనుకకు వంచాలి.
➤ ఊపిరితిత్తులను, ఉదర భాగాలను, వెన్నుపూసను బలపరుస్తుంది. చేతులు మరియు భుజాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది.

3. పాద హస్తాసన : హస్త ఉత్తానాసన నుండి ఊపిరి వదులుతూ ముందుకి వంగుతూ రెండు అరచేతులు మీ పాదాల పక్కనున్న నేలని తాకేలా ప్రయత్నించండి.
➤ ఈ ఆసనం వల్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది. స్త్రీల రుతు సమస్యలు తగ్గుతాయి. మెదడు కి రక్త ప్రసరణ మెరుగవుతుంది.

4. అశ్వ సంచలనాసన : ముందుగా ఎడమ కాలుని వెనక్కి ఉంచి, కుడి కాలుని మడచి మీ గుండె కి దగ్గరగా తీసుకొచ్చి, ఊపిరి తీసుకుంటూ తలను పైకెత్తి చూడాలి.
➤ వెన్నెముకకు మంచి బలాన్ని ఇస్తుంది. కాళ్ళు మరియు తొడల కండరాలను బలపరుస్తుంది.

5. దండాసన : మీ శరీరాన్ని నేలకి సమాంతరంగా ఉండేలా కాళ్ళు, చేతులు నేలమీద ఉంచి నడుమును పైకి ఎత్తకుండా శరీర బరువు మొత్తం కాళ్ళు మరియు చేతులతో మోసే విధంగా ఊపిరి తీసుకుంటూ చేయాలి.
➤ ఈ ఆసనం ఛాతీ, వెన్నెముకకు బలం చేకూరుస్తుంది. భుజాలనీ, ఛాతీనీ స్ట్రెచ్ వల్ల శరీరానికి మంచి సౌష్టవం వస్తుంది. వెన్నునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

6. అష్టాంగ నమస్కారాసన : తల, కళ్ళు, చెవులు, నోరు, హృదయం, చేతులు, పాదాలు, తొడలు - వీటిని అష్టాంగాలు అని పిలుస్తారు. ఊపిరి వదులుతూ మీ పిరుదులని పైకి ఎత్తి, మీ గడ్డం, చేతులు, ఛాతీ, మోకాళ్ళు నేలని తాకేట్టుగా ఉండాలి.
➤ కాళ్ళు, చేతులు మరియు మెడ కండరాలను బలపరుస్తుంది.

7. భుజంగాసన : బోర్లా పడుకొని ఊపిరి తీసుకుంటూ చేతుల సహాయంతో నడుముకు పై భాగం మొత్తాన్ని వెనుకకు పాము పడగ విప్పినట్టుగా వంచాలి.
➤ ఈ ఆసనం నడుము నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణకోస వ్యాధులు తగ్గించి, మలబద్దకం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను నివారిస్తుంది.

8. పర్వతాసన : ఊపిరి వదులుతూ రెండు కాళ్ళు, రెండు చేతులు దూరంగా నేలకు ఆనించి నడుమును పైకి లేపి పర్వతాకారంలో ఉండాలి.
➤ కాళ్ళు మరియు చేతుల కండరాలకు మంచి బలాన్నిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరచి వేరికోస్ వెయిన్స్ నుండి ఉపశమనం లభిస్తుంది. వెన్నెముకకు కూడా బలపరుస్తుంది.

9. అశ్వ సంచలనాసన : పైన తెలిపిన 4వ ఆసనాన్ని మరల చేయండి.

10. పాదహస్తాసన : పైన తెలిపిన 3వ ఆసనాన్ని మరల చేయండి.

11. హస్త ఉత్తాసన : పైన తెలిపిన 2వ ఆసనాన్ని మరల చేయండి.

12. ప్రణామాసన : పైన తెలిపిన 1వ ఆసనాన్ని మరల చేయండి.

సూచనలు : సూర్య నమస్కారాలు చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.


# సూర్య నమస్కారాలు సాధన చేయడానికి అనువైన సమయం సూర్యోదయ సమయం. సూర్యునికి అభిముఖంగా, నెమ్మదిగా చేయడం ఇంకా మంచిది. సూర్యాస్తమయం సమయంలో కూడా సాధన చేయవచ్చు.
# శ్వాసక్రియను ఆసనాలకు అనుగుణంగా జోడించడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.
# క్రమం తప్పకుండా ఆచరించాలి.
# మొదట్లో నియమితంగా చేస్తూ, యోగా నిపుణుల సలహాతో సాధనను పెంచవచ్చు.
# చివరగా శవాసనంతో శరీరానికి విశ్రాంతినిచ్చి విరమించాలి.

జాగ్రత్తలు : సూర్య నమస్కారాలు చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.


# వెన్నునొప్పి, డిస్క్ సమస్యలు, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని సాధన చేసే ముందు వైద్యుడిని మరియు యోగా నిపుణులను సంప్రదించాలి.
# హెర్నియా, సయాటికా ఉన్నవారు చేయరాదు.
# స్త్రీలు నెలసరి సమయంలో చేయరాదు.

Post a Comment

Previous Post Next Post