సూర్య నమస్కారాలు … సులువుగా బరువు తగ్గే మార్గం !!!

 


ఆరోగ్యవంతమైన జీవనానికి సూర్య నమస్కారాలు ఎలా ఉపయోగపడతాయి?

సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఆయన లేనిదే ఈ భూమిపై జీవం లేదు. ఈయన రాకతోనే మనకు రోజు మొదలవుతుంది. మొక్కలు ఈ సూర్య కాంతిని ఉపయోగించి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అవి బ్రతుకుతూ మనుషులతో పాటు అనేక జీవరాశులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. సూర్యోదయపు కాంతి కిరణాలలో మనకు ఎంతో అవసరమైన Vitamin-D పుష్కలంగా లభిస్తుంది. అందుకే మన పూర్వీకులు ఎప్పుడో ఈ సూర్య నమస్కారాలను ప్రతి రోజూ ఆచరించాలని సూచించారు. ఇది ఆ సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పే ఒక హిందూ ఆచారంగా సూచించినప్పటికీ, వాటి వెనుక మానవాళికి ఉపయోగపడే ఎంతో ఆరోగ్య విజ్ఞానం దాగి ఉంది.
సూర్య నమస్కారాలు మన మానసిక, శారీరక ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తాయని అనేకమంది యోగా నిపుణులు తెలుపుతున్నారు. అనేకమంది సెలబ్రిటీలు, సినిమా తారలు సైతం నేడు ఈ సూర్య నమస్కారాలు వారి దైనందిక జీవితంలో ఒక భాగంగా అనుసరిస్తున్నారు.
ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితాలలో నేటి తరానికి సరైన పని వేళలు లేవు, సరైన తిండి వేళలు లేవు. అనేక మానసిక ఒత్తిడి ల మధ్య ఆరోగ్యం కోసం ఖచ్చితంగా కొంత సమయం వ్యాయామం లేదా యోగా కు కేటాయించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. లేకపోతే ఆ సంపాదనను, తర్వాత వచ్చే అనారోగ్యాలకు ఖర్చు చేయాల్సి రావొచ్చు. కానీ చాలా మందికి వాకింగ్, వ్యాయామం వంటి వాటిని చేయాలని ఉన్నా సమయం లేక, అవకాశం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ సూర్య నమస్కారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కఠిన వ్యాయామాలు లేకుండా వీటి ద్వారా కూడా సులభంగా బరువు తగ్గవచ్చు. సుమారు 10 నిమిషాల పాటు చేస్తే 130 పైగా కేలరీలు తగ్గుతాయి. సూర్య నమస్కారాలకు మన పూర్తి శరీరాన్ని టోన్ చేసే శక్తి ఉంది కావున ఇది మీ మొత్తం శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.

సూర్య నమస్కారాలలో మొత్తం 12 రకాల ఆసనాలు ఉంటాయి. వీటిని ఒక క్రమ పద్దతి లో చేయాలి.
1. ప్రణామాసన,
2. హస్త ఉత్తానాసన,
3. పాద హస్తాసన,
4. అశ్వ సంచలనాసన,
5. దండాసన,
6. అష్టాంగ నమస్కారాసన,
7. భుజంగాసన,
8. పర్వతాసన,
9. అశ్వ సంచలనాసన,
10. పాదహస్తాసన,
11. హస్త ఉత్తాసన,
12. ప్రణామాసన


సూర్య నమస్కారాలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలు:


1. సూర్య కాంతిలో ఉండే Vitamin-D మన శరీరంలో ఎముకలు మరియు దంతాలకు ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా పోషకాలు మన శరీరానికి అందుతాయి.


3. కొవ్వు కరిగించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.


4. చర్మ సౌదర్యాన్ని పెంచుతుంది.


5. కండరాలకు ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది.


6. ఆందోళన తగ్గించి మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది.


7. ఈ ఆసనాలలో నియమబద్ధంగా శ్వాస తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.


8. నిద్రలేమిని తగ్గిస్తుంది.


9. మంచి శరీర ఆకృతి లభించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


10. ఆడవారిలో పీరియడ్స్ లో వచ్చే నొప్పి వంటి సమస్యలు తగ్గిస్తుంది.


11. బి.పి. ని నియంత్రణలో ఉంచుతుంది.


12. హార్మోనల్ ఇంబ్యాలన్స్ ను తగ్గిస్తుంది.

రోజూ క్రమం తప్పకుండా ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండవచ్చు.

Post a Comment

Previous Post Next Post