కరివేపాకు నూనె, కరివేపాకు హెయిర్ ప్యాక్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి?
కరివేపాకు … ఇది కేవలం వంట పదార్థం అనుకుంటే చాలా పొరపాటే. దీనిలో ఉండే అనేక ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ మనం ఇప్పుడు ప్రత్యేకంగా జుట్టు సమస్యలు నివారించడానికి, ముఖ్యంగా జుట్టు పెరుగుదల, తెల్ల జుట్టు, చుండ్రు వంటి సమస్యల నివారణకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
కరివేపాకు భారతీయ వైద్యంలో జుట్టు సంరక్షణ కోసం పూర్వము నుండి ఉపయోగించబడింది. దీనిలో జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నాయి. ఇది విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్ మరియు ఐరన్ యొక్క గొప్ప సమ్మేళనం. ఇవి జుట్టు సంరక్షణలో ఎలా సహకరిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు పెరుగుదల : కరివేపాకులో వివిధ పోషకాలు ఉన్నాయి, ఇవి రక్తహీనతను తగ్గించి జుట్టు పెరుగుదలను మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
తెల్ల జుట్టు నివారణ : కరివేపాకులో పిగ్మెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును చిన్న వయసులోనే నెరసిపోకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
జుట్టును బలోపేతం చేయడం : కరివేపాకులో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టుకు తగిన పోషణ అందించి, బలంగా తయారు చేయడానికి మరియు దాని ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
చుండ్రును తగ్గించడం : కరివేపాకులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి చుండ్రు మరియు ఇతర స్కాల్ప్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
కరివేపాకును జుట్టు సంరక్షణకు వివిధ పద్దతులలో అనగా నూనెలు, లేపనాలు వంటి వాటిలో ఉపయోగించవచ్చు. వాటిలో కొన్ని ప్రభావవంతమైన విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం:
కరివేపాకు నూనె: ఒక పిడికెడు తాజా కరివేపాకును తీసుకొని, సుమారు 100 ml నుండి 150 ml కొబ్బరి నూనెలో వేసి ఆకులు నల్లగా మారే వరకు సిమ్ లో ఉంచి మరిగించాలి. తర్వాత నూనెను వడకట్టి, చల్లబరచి నిల్వ చేయండి. తలస్నానానికి కనీసం అరగంట ముందు తలకు ఈ నూనెను రాసుకొని మునివేళ్లతో బాగా మసాజ్ చేయండి. తర్వాత కుంకుడుకాయ లేదా తక్కువ రసాయనాలు గల షాంపూతో స్నానం చేయండి.
కరివేపాకు పేస్ట్: కొన్ని తాజా కరివేపాకులను గ్రైండ్ చేసి, కొబ్బరి నూనె లేదా పెరుగుతో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలకు మరియు జుట్టుకు పట్టించి 30 నిమిషాల నుండి గంట వరకు అలాగే ఉంచండి. తర్వాత తేలికపాటి షాంపూతో తల స్నానం చేయండి.
కరివేపాకు హెయిర్ మాస్క్: కరివేపాకు పేస్ట్ మరియు తేనె సమాన భాగాలుగా మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని మీ తలకు మరియు జుట్టుకు అప్లై చేయండి. సుమారు 30 నిమిషాల నుండి గంట వరకు అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో తల స్నానం చేయండి.
కరివేపాకు నీటి చికిత్స: ఒక గుప్పెడు కరివేపాకును నీటిలో బాగా మరిగించి చల్లారనివ్వాలి. మీరు తలస్నానం చేసిన తర్వాత, చివరగా ఈ కరివేపాకు నీటితో బాగా శుభ్రం చేసుకోండి. ఇది మంచి కండీషనర్ గా కూడా పనిచేస్తుంది.
గమనిక : జుట్టు మరియు చర్మ స్వభావం అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి సున్నితమైన చర్మం లేదా ఏదయినా చర్మ సమస్యలున్నవారు ప్రయత్నించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.