మొలకలు ఎలా తినాలి? ఎన్ని తినాలి? ఎప్పుడు తినాలి?

 

How to eat sprouts? How much to eat? When to eat?

మొలకలు రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి?

మొలకలు ఒక సంపూర్ణ, అద్భుత, ఆరోగ్యకరమైన శాఖాహారం. పెసలు, బొబ్బర్లు, శనగలు, బఠాణీలు, సోయా బీన్స్ వంటి వాటిని మొలకలుగా ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఐరన్, కాపర్, మాంగనీస్ మరియు పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక మొలకలలో పీచు పదార్థాలు, ఎంజైములు మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. కానీ కేలరీలు చాలా చాలా తక్కువ. మనం అనేక పప్పు దినుసులు, విత్తనాలను నేరుగా ఉడికించి కూరలలో తింటూ ఉంటాం. కానీ వీటిలో కొన్నింటిని నానబెట్టి, మొలకలు వచ్చేవరకు ఉంచి తర్వాత తినడం వల్ల వాటిలో ఉండే పోషకాలు అనేక రెట్లు పెరుగుతాయి. ఈ తరం వారికి ప్రొసెస్డ్ ఫుడ్స్ పై మక్కువ ఎక్కువ ఉండటం వలన అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అటువంటి వారు కూడా వారంలో కనీసం ఒకసారి ఈ మొలకలు తినడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇటువంటి ప్రకృతి సిద్ధమైన ఆహారాలపై అవగాహన కల్పించడం కోసమే ఈ కథనం. మొలకల వల్ల కలిగే ప్రయోజనాలు ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం.

జీవక్రియను మెరుగుపరుస్తుంది: ఇవి త్వరగా అరిగిపోయే లక్షణం కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిని బాగా నమిలి తినాలి, తద్వారా లాలాజలంతో కలిసి జీవక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఉండే పీచు పదార్థాలు ప్రేగులను శుభ్రపరుస్తాయి. సాధారణంగా ఇటువంటి గింజలని ఉడికించి తీసుకుంటే వాటిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. కావున వీటిని నేరుగానే తీసుకోవడం చాలా ఉత్తమం.

బరువు తగ్గిస్తుంది: వీటిలో ఉండే అధిక ప్రోటీన్లు కొంచెం తినగానే కడుపు నింపుతాయి. అందువల్ల త్వరగా ఆకలి వేయదు. వీటిలో కేలరీస్ లేకపోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. మొలకల్లో ఉండే అధిక ఫైబర్ కూడా బరువు తగ్గించడంలో సహాయపడతాయి.

రోగ నిరోధక శక్తి పెంచుతుంది: మొలకల్లో విటమిన్స్, మినిరల్స్ తో పాటు ఐరన్, కాపర్, మాంగనీస్ మరియు పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో ఎర్ర రక్తకణాలను పెంచుతాయి. తద్వారా రక్తప్రసరణ మెరుగవుతుంది. వీటిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తి పెంచుతాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది: మొలకలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. అంతేకాక వీటిలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు కార్డియో వాస్క్యులర్ సమస్యలు రాకుండా నిరోధించి గుండెను కాపాడతాయి. 

చర్మ సమస్యలు: మొలకలలో విటమిన్-A , విటమిన్-C అధికంగా ఉండటంతో పాటుగా యాంటీ-ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల చర్మం పొడిబారి పోకుండా చేసి అందాన్ని కూడా పెంపొందించుకోవడానికి ఉపయోగ పడుతుంది.

జుట్టు సమస్యలు: వీటిలోని విటమిన్-C, జింక్ లు వెంట్రుకల కుదుళ్లు బలపడేలా చేసి, ఫ్రీరాడికల్స్ నివారించి జుట్టును ఒత్తుగా మరియు దృఢంగా చేస్తాయి. అంతేకాక పురుషుల్లో బట్టతల మరియు అలోపేసియా సమస్యలను తగ్గిస్తుంది.

కాన్సర్ నిరోధకాలు: మొలకలలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ క్యాన్సర్ వంటి దీర్ఘ కాళిక మరియు అనువంశిక రోగాలు రాకుండా నిరోధిస్తాయి.

అధిక మాంసకృత్తులు: మొలకలలో మాంసకృత్తులు చాలా అధికంగా సుమారుగా 35% వరకు ఉంటాయి. ఇవి మన శరీరానికి సరిపడేంత ప్రోటీన్స్ అందించడమే కాక చెడు కోలెస్టరాల్ ను తగ్గిస్తాయి.

థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది: మొలకలు శరీరంలో కొత్త రక్తకణాలు పుట్టేలా చేస్తాయి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల మన శరీరంలోని రక్తంతో పాటు, ఆక్సిజన్ ను శరీరంలోని అన్ని బాగాలకు ప్రసరించేందుకు సహాయపడుతుంది. దానివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్-A , విటమిన్-C, బి-కాంప్లెక్స్ వంటి వివిధ రకాల విటమిన్స్ దీర్ఘకాలిక థైరాయిడ్ వ్యాధిని నయం చేయడంలో ఉపకరిస్తాయి.

ఎలా తినాలి?

నాణ్యమైన విత్తనాలు నానబెట్టిన తర్వాత, మొలకలు సుమారు 4-5 సెం. మీ. వరకూ పెరుగుతాయి. ఇలా పెరగడం వల్ల పూర్తి స్థాయిలో పోషకాలు ఉంటాయి. బాగా అరుగుతాయి. కాబట్టి మనం ఎంచుకొనే విత్తనాలు నాణ్యమైనవైతే మంచిది. వీటిని బాగా నమలాలి, అలా నమిలినప్పుడు నోట్లోని లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం విత్తనాలలోని కార్బోహైడ్రేట్స్‌ జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. వీటిని జీర్ణం చేయడానికి జీర్ణాశయం, ప్రేగులల్లో రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల పేగులు పోషకాలను ఎక్కువగా శోషించుకుంటాయి.
కొంతమంది వీటిని నమలలేక, జ్యూస్‌ చేసుకొని తాగుతుంటారు. అలా తాగడం వల్ల వీటిలో ఉండే పోషకాలు శరీరానికి అంతగా అందవు. పేగులు వీటిల్లో ఉండే పోషకాలను ఎక్కువగా శోషించుకోలేవు. కాబట్టి జ్యూస్ చేసుకొని తాగడం కంటే నమిలి తింటేనే మంచి ఫలితం ఉంటుంది.

ఎన్ని తినాలి?

మొలకలను రోజుకి 100 గ్రా. నుండి 150 గ్రా. వరకు తినవచ్చు. మొదట్లో కొంచెంగా అలవాటు చేసుకొని తర్వాత పెంచుకోవచ్చు. రుచి కోసం తేనె, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, నిమ్మరసం, దానిమ్మ గింజలు, ఉల్లి పాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకుని తినవచ్చు.

ఎప్పుడు తినాలి?

మొలకలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తినడం చాలా మంచిది. ఉదయం నుండి మధ్యాహ్నం లోపు ఎప్పుడైనా తినవచ్చు. కానీ రాత్రి పూట మాత్రం తినడం వల్ల అరుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post