బీహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న



న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ నేత, బీహార్ కు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. ఈయన 1924వ సంవత్సరం జనవరి 24న బీహార్ లోని, సమస్తిపూర్ లో జన్మించారు. విద్యార్థి దశ నుండే అనేక ఉద్యమాలలో చాలా చురుకుగా పాల్గొనేవారు. అందులో భాగంగానే ఈయన 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. అనంతరం రాజకీయాల్లో రాణించారు. 

1952వ సంవత్సరంలో బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. తర్వాత 1968లో ఉప ముఖ్యమంత్రి గాను, తదుపరి 1970లో ముఖ్యమంత్రిగాను పనిచేశారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు కూడా ప్రాధాన్యం కల్పించాలని ఉద్దేశంతో ‘కర్పూరి ఠాకూర్ ఫార్ములా’ కు రూప కల్పన చేసారు. తద్వారా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించారు. ఈయన చేసిన సేవలకు గాను అక్కడి ప్రజలు ‘జననాయక్’ అని పిలుచుకుంటారు.

సమాజంలో ఉన్న అసమానతలపై పోరాటం చేసి, పేదలు, దళితుల సంక్షేమానికి ఆయన విశేషమైన సేవలు అందించినందుకు గాను భారత ప్రభుత్వం ఆయనను భారతరత్నతో సత్కరించింది. ఈ సందర్భంగా దేశ ప్రధాని మోడీ మాట్లాడుతూ దళిత వర్గాల అభ్యున్నతి పట్ల ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కాగా ఆయన శతజయంతి ఉత్సవాలకు ఒక రోజు ముందే ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడం మరొక విశేషం.


Post a Comment

Previous Post Next Post